ప్రారంభమైన మహా గణపతి శోభాయాత్ర…….

0

భాగ్యనగరంలో శోభాయాత్ర షురూ అయ్యింది. బాలాపూర్ వినాయకుడు వీడ్కోలు చెబుతూ.. ముందుకు కదిలాడు. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర.. ట్యాంక్ బండ్ వరకు కొనసాగుతుంది. 11 రోజుల పాటూ భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు.. అందరికీ వీడ్కోలు చెబుతూ.. తన తల్లి గంగమ్మ ఒడిలోకి వెళ్లేందుకు పయనమయ్యాడు.

ఇటు ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ వినాయకుడు.. నిమజ్జనానికి కదిలాడు. నిన్న రాత్రి నుంచే నిమజ్జన పనులను ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ మెంబర్స్ పూర్తి చేశారు. ఇవాళ ఉదయమే నిమజ్జనానికి మహా గణపతి.. కదిలివెళ్లాడు. భారీగా జనసందోహం, కోలాహలం మధ్య.. శోభాయాత్ర ప్రారంభమైంది. ఇక ఈ ఏడాది కూడా మధ్యాహ్నం లోగా నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.


ఇక ట్యాంక్‌బండ్ దగ్గర కూడా జనసందోహం పెరుగుతోంది. వినాయకులను నిమజ్జనం చేసేందుకు భారీ క్రేన్లు సిద్దంగా ఉన్నాయి. మరోవైపు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. సుమారు 26 వేల మంది పోలీసులతో పహారా కొనసాగుతుందని.. సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

మరోవైపు నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ప్రధాన ఊరేగింపు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. నిమజ్జనానికి భక్తులు వచ్చేందుకు ప్రధాన రూట్లలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. ఈ బస్సులకు నిర్ణీత ప్రదేశాల్లో పార్కింగ్‌ ఏర్పాటు చేయనున్నారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగర శివార్లకు పరిమితం చేస్తారు. ప్రతి అరగంటకు ఒక ఎంఎంటీఎస్‌ రైలు నడిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.