PSLV C-40 రాకెట్ ప్రయోగం విజయవంతం..

0

100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో సరికొత్త చరిత్రను సృష్టించింది. నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోట‌లోని షార్ కేంద్రం నుంచి ఉదయం 9 గంటల 29 నిమిషాలకు నింగిలోకి పంపించిన వందో ఉపగ్రహం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ-సి40 రాకెట్ 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. వీటిలో భారత్‌కు చెందిన కార్టోశాట్‌2ఇ, ఒక నానో శాటిలైట్‌, ఒక సూక్ష్మ ఉపగ్రహం ఉన్నాయి. వీటి ప్రయోగంతో భారత్‌కు చెందిన మొత్తం వంద ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరినట్లయింది. 2018లో మొదటి ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తల్లో ఆనందం వెల్లివిరిసింది.  

 గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తరలించిన ఘనత ఇస్రో సొంతం. ఆ ప్రయోగంతో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌చేరింది. 2013లో అమెరికా 29, 2014లో రష్యా 37 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించాయి. ఆ రికార్డులను భారత్‌బద్దలు కొట్టడమే కాకుండా సమీపకాలంలో ఎవరూ అందుకోని రికార్డుకు చేరుకుంది. ఈ దఫా మొత్తం 31 ఉపగ్రహాలు ప్రయోగించ‌గా.. వాటిలో 28 విదేశాలకు చెందినవి. ప్రధానంగా ‘కార్టోశాట్‌2’ సిరీస్‌లోని కీలకమైన ఉపగ్రహం భారత్‌కు చెందినది. దీనితో పాటు మైక్రో, నానోలు మనదేశానివి.

భూమి మీద నిర్దిష్ట ప్రదేశానికి సంబంధించి హైరిజల్యూషన్‌చిత్రాలను అందించడం కార్టోశాట్‌2ఇ ఉపగ్రహ ప్రత్యేకత. కార్టోశాట్‌2 శ్రేణిలో ఇది మూడో ఉపగ్రహం. ఇందులో పాన్‌క్రొమాటిక్‌, మల్టీ స్పెక్ట్రల్‌కెమెరాలు ఉంటాయి. హై రిజల్యూషన్‌డేటాను అందించడంలో వీటికి తిరుగులేదు. పట్టణ, గ్రామీణ ప్రణాళిక.. తీర ప్రాంత వినియోగం, నియంత్రణ.. రోడ్డు నెట్‌వర్క్‌ పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌ల తయారీ.. భౌగోళిక, మానవ నిర్మిత అంశాల్లో మార్పు పరిశీలన వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here